హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు సుమోటాగా కేసులు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్ కింద వీరిద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
పాత బస్తీలో రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక… ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అక్రమ నిర్మాణాలపై మాట్లాడుతూ… హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చగలరా? అంటూ సవాల్ విసిరారు. దీనికి బండి సంజయ్ స్పందిస్తూ… పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలిస్తే… రెండు గంటల్లోగా మీ దారుస్సలాంను కూల్చేస్తామని ఛాలెంజ్ విసిరారు. వీరిద్దరి వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని, అందుకే కేసులు నమోదు చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు.