ఈ డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ గురించిన ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోవడం అత్యావశ్యకం.యూపీఐ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరు.చెల్లింపులకు సంబంధించిన లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్నారు.యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ విధానంలో (యూపీఐ) లావాదేవీలపై చార్జీలు విధించే ప్రసక్తి లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రయత్నం మాత్రమేనని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు వేరువేరు మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో తెలిపింది.
డిజిటల్ చెల్లింపులు, పేమెంట్ ప్లాట్‌ఫాంలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు ప్రభుత్వం గతేడాది ఆర్థిక సహకారం అందించిందని, ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తామని ప్రకటించిందని ఆర్థిక శాఖ వివరించింది. ఐఎంపీఎస్ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్ బ్యాంక్ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.