హైదరాబాద్: భూ రిజిష్ట్రేషన్లలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు.