end

ఈ చిలుక స్మార్ట్‌ ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంది

మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు. కానీ, స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేసే చిలుక కూడా ఉంది అంటే నమ్మగలరా? వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా ఇది నిజం. మొబైల్‌ను ఉపయోగించడం, మనుషులను అనుకరించడం, మాట్లాడటం ఇలా తన చేష్టలతో అందరినీ ఔరా అనిపిస్తోంది ఆ సిత్తరాల చిలుక. వివరాల్లోకి వెళితే..

బిహార్‌లోని కటిహార్‌లో నివాసం ఉండే రాజీవ్‌ శర్మ కుటుంబం ఏడాది క్రితం చిలుకను తెచ్చుకుని పెంచుకుంటోంది. ఈ చిలుకకు డుగ్గూ అని పేరు కూడా పెట్టుకున్నారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన డుగ్గూ వారిని అనుకరించడం మొదలు పెట్టింది.

అలా ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసి మొబైల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది.  ఆండ్రాయిడ్‌ ఫోన్లను తన ముక్కు సాయంతో ఎంచక్కా ఆపరేట్‌ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతే కాదండోయ్‌.. యూట్యూబ్‌లో వీడియోలను కూడా ఈ చిలుక వెతికి మరీ చూస్తోందంట. ఫోన్‌లో బొమ్మలు కనిపిస్తే చాలు చిలుక పలుకులు పలుకుతూ మురిసిపోతోంది. తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డుగ్గూను రాజీవ్‌ శర్మ కుటుంబం పంజరంలో పెట్టకుండా తమ ఇంట్లో మనిషిగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినప్పుడు ఈ చిలుక వారితో పాటే ద్విచక్ర వాహనంపై షికారుకు కూడా వెళ్తోంది. వారి భుజాలపై కూర్చుని ఎంచక్కా సవారీ చేస్తుంది.

Exit mobile version