end

తమ్ముడికి అండగా ‘అన్నయ్య’

జనసేన కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పార్టీకి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం మాట్లాడిన ఆయన.. పవన్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవే కారణమని తెలిపారు. ఓ రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు.

నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అంతేకాదు రానున్న తిరుపతి ఉపఎన్నికలో జనసేన నిలిస్తే… పార్టీకి చిరంజీవి మద్దతుగా నిలుస్తారన్న టాక్ వినపడుతోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన గెలుపునకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తే నిజమైతే ఇక ఏపీలో జనసేనకు తిరుగుండదని మెగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version