end

కారు ప్రమాదం గురించి క్లారిటీ..

హైదరాబాద్: జీహెచ్‌ఎసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కాన్వాయ్‌ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. మంత్రికి సంబంధించిన కాన్వాయ్‌లో వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు.. ఆయనకు చెందిన కారుపై దాడి కూడా చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలతో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే మంగళవారం రోజున ఘటనలపై ఇంతవరకూ స్పందించని మంత్రి.. బుధవారం మధ్యాహ్నం స్పందించి నిన్న అసలేం జరిగింది..? ఎవరు ఎవరిపై దాడి చేశారు..? కాన్వాయ్‌లోని కారు హల్ చల్ వెనుక అసలేం జరిగింది..? అనేదానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..? (మంత్రి మాటల్లో)
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో నా మెడికల్ కళాశాలకు వెళ్తుండగా కోరమాల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు నా కాన్వాయ్‌పై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రస్టేషన్‌తో నాపై దాడికి దిగారు. కమలం పువ్వు నేతలకు ఈ సందర్భంగా నేను చెబుతున్నా.. కారులో డబ్బులు పెట్టి పంచడానికి నేను వెర్రిపువ్వుని కాదు. బీజేపీ నాపై దాడి చేసిన సమయంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి దిగారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కిన కారు నాది కాదు. నా కాన్వాయ్‌లో అన్నీ ఫార్చూనర్ వాహనాలే. బీజేపీ కార్యకర్తలు నన్ను చంపటానికి ప్రయత్నించారు. బీజేపీ నాపై చేసిన దాడిని కమ్యూనిస్టు నారాయణ సమర్థిస్తున్నారా..? నేనూ కమ్యూనిస్టు బిడ్డనే ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు. నారాయణ లాంటి సీనియర్ నేత అసలేం జరిగింది అనే పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం సరికాదు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. గ్రేటర్‌లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది’ అని మంత్రి పువ్వాడ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు, నారాయణ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Exit mobile version