సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు. సరైన మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. నిన్న సిద్దిపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి.. అక్కడి ఒంటిమామిడి మార్కెట్‌యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రైతు వద్ద నుంచి పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అది కూడా మద్దతు ధర చెల్లించే తీసుకుంటామన్నారు. ఇదే సందర్భంలో సీఎం.. కమీషన్ ఏజెంట్లకు చురకలంటించారు. రైతుల వద్ద విచ్చలవిడిగా కమిషన్లు దండుకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. వారి నుంచి కేవలం 4 శాతం కమిషన్ మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం మాటలకు రైతులు హర్షం వ్యక్తం చేశారు.