-
నాలుగు రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి
-
అటు కేంద్ర మంత్రులతో చర్చలు, వినతులు
-
ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో వరుస భేటీలు
-
సీఎం వెంట పలువురు మంత్రులు
-
అలకల నేతల బుజ్జగింపులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడే వరుసగా అధికారిక అనధికారిక మంతనాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి కావలసిన అంశాలపై వినతిపత్రాలు ఇస్తున్నారు. (Delhi) మరోవైపు కాంగ్రెస్ అధిష్టానంతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుజ్జగింపు తదితర అంశాలతో ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం హాట్ హాట్ గా మారింది.
తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా..
తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో(RRR) రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన 2,450ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయితే నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకాలు తొలగిపోతాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)-పీఎంఏవై (యూ) కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తున్నందున, తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
పీఎంఏవై (యూ) కింద గ్రాంటుగా తెలంగాణకు రావల్సిన రూ.784,88 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. నగరంలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. నగరంలో వివిధ మార్గాల్లో మెట్రో రైలు విస్తరణకు (Metro Rail) సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. ఈ విషయంలో తమకు చేయూతనివ్వాలని కోరారు. వరంగల్, కరీంనగర్ సమస్యలపైనా కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో చేపట్టిన పనులు పూర్తికాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పనులు పూర్తయ్యే వరకు స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్‌హెచ్ఎం బకాయిలు రాబట్టేందుకు..
మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఙప్తి చేశారు.
ఆర్ఆర్ఆర్… రహదారుల విస్తరణ
జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ప్రాంతీయ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించినందున, దక్షిణ భాగంలోని చౌటుప్పల్ నుంచి అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆర్ఆర్ఆర్ (RRR) ఉత్తరభాగంలో భూ సేకరణ, పనుల తీరును వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానించే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని (ఎన్‌హెచ్-65) ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ-కొత్తగూడెం రహదారి (ఎన్‌హెచ్-930పీ), (NHAI) కల్వకుర్తి నుంచి కొల్లాపూర్-కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్-167కే) జాతీయ రహదారుల పనుల్లోని జాప్యం, ఐకానిక్ బ్రిడ్జి పనులు ప్రారంభంకాకపోవడంతో వాటిని వెంటనే ప్రారంభించాని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్- కల్వకుర్తి (ఎన్‌హెచ్ 765కే) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని, హైదరాబాద్-శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ (National Highways) రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారికి (ఎన్‌హెచ్-163) ఎదురవుతున్న పర్యావరణ ఆటంకాలు తొలగించాలని, సేతు బంధన్ స్కీం కింద 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 1617 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల స్థాయిని పెంచాలని ముఖ్యమంత్రి కోరారు.