బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. దుబ్బాకలో ఓటమి, బీజేపీ దూకుడు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. అయినా బీజేపీని చూసి పెద్దగా హైరానా పడొద్దని నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ మాత్రం లేదని సీఎం చెప్పుకొచ్చారు. బీజేపీ నేతల అబద్ధాలను మాత్రం ఎక్కడికక్కడ ఎండగట్టాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.