రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో అయ్యిందని, దానిని పట్టించుకోవద్దంటూ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కొంతమంది సీనియర్ నాయకులు కమలదళ నాయకత్వానికి సూచించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కమలనాథులు కాంగ్రెస్ నాయకత్వం చేసే వ్యాఖ్యలు, విమర్శలపై స్పందించకుండా వ్యూహాత్మక మౌనం\ ప్రదర్శిస్తున్నారు. మనల్ని లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముఖ్యులు అంతర్గతంగా ఒక్కటయ్యారు.. పథకం ప్రకారం మన దూకుడుకి అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మన లక్ష్యసాధనలో భాగంగా తొలి ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్‌ను మనకంటే వెనక్కి నెట్టివేయడంలో సఫలమయ్యాం. ఇక మన టార్గెట్ టీఆరెస్సే. అందువల్ల, కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి ప్రాధాన్యం పెంచవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై స్పందించవద్దు’ అని కమలం నాయకత్వం, శ్రేణులను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. ‘సాధారణ పరిస్థితుల్లోనయితే, కాంగ్రెస్ నాయకులు చేసే వ్యాఖ్యలపై మా పార్టీ నుంచి స్పందన ఉండేది.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్ వంటి అగ్రనేతలు మాపై విమర్శలు చేసినా, కుల సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించినా, మా వైపు నుంచి స్పందన లేదంటే వ్యూహాత్మకమే’ అని బీజేపీ ముఖ్యనేత తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే, టీఆర్‌స్‌కు వేసినట్లే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడమే ఇందుకు నిదర్శనం.. అంటూ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా తాము చేసిన ప్రచారం సత్ఫలితాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవానికి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలోకి చేరడంతో ఆ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఇదే సమయంలో మా పార్టీ నాయకత్వం మారడంతో పాటు రాజకీయ వైఖరిలోనూ అనూహ్య మార్పు చోటుచేసుకోవడం తాము కూడా ఊహించలేద’ని కమలం పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.
టీఆర్‌ఎస్ గ్రూపు తగాదాలపైనా ప్రత్యేక దృష్టి..
టీఆర్‌స్‌లో గ్రూపు తగాదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. ఏయే నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేకు, స్థానిక ముఖ్యనేతలకు విభేదాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పటికే జాబితా రెడీ అయ్యింది. తమ కార్యాచరణ కూడా ఆరంభమైంది. ఇందులో భాగమే నిజామాబాద్ రూరల్ సెగ్మెంటులో టీఆర్‌ఎస్‌కు షాక్.. అని బీజేపీ కీలక నేత ఒకరు చెప్పారు. ఈ ఫలితం కోసం, దాదాపు ఆరునెలలుగా అంతర్గత కసరత్తు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో పాటు కేంద్రమే నిధులిస్తుంటే పెత్తనం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెలాయిస్తోందంటూ తాము చేసిన ప్రచారం కూడా బాగా పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం వాటా లేని సంక్షేమ పథకం రాష్ట్రంలో లేదని కుండబద్ధలు కొట్టడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమవైపు ఆకర్షితులవుతున్నారని ఆయన విశ్లేషించారు.