హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన పార్టీ మార్పుపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం బీజేపీలో చేరతానని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఉందని, మాటకు మాట అన్నట్టుగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో కాంగ్రెస్ వెనుకబడిందని చెప్పుకొచ్చారు. ఎవరికి పీసీసీ పదవి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న మాట మీదకు వచ్చామన్నారు. కేసీఆర్‌కు, ఇతర టీఆర్ఎస్ నాయకులకు పదునైన భాషతో బదులు చెప్పే నేతలే కాంగ్రెస్‌కు కావాలన్నారు. కేసీఆర్ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.