హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ ఏ డివిజన్‌లోనూ కనీస ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్‌లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్.. గ్రేటర్‌లో మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్‌లో మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది.
ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ 10 స్థానాల్లో గెలిచి, మరో 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పలుచోట్ల అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌పై మజ్లీస్ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో గెలిచి.. 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇకపోతే అధికార టీఆర్‌ఎస్ గతంలో కంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ మేయర్ స్థానం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే టీఆర్‌ఎస్ 21 స్థానాల్లో విజయబావుటా ఎగురవేయగా.. 41 స్థానాల్లో లీడిండ్‌లో ఉంది.