న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత కొద్దిరోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సవ్యంగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు.
కాగా, అహ్మద్ పటేల్ మరణం పట్ల ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ తదితరులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరో దిగ్గజ నేతను కోల్పోయిందని యావత్ దేశప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.