end

ఇంటింటికీ కరోనా బూస్టర్‌ డోసు

  • సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
  • గ్రామాల్లో ప్రతి శుక్రవారం, పట్టణాల్లో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
  • వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీ ఆర్ కే భవన్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కొనసాగుతున్న వీడియో కాన్ఫరెన్స్.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీజన్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులు అధికంగా నమోదువుతున్నాయని, ఇప్పటి వరకు 1,610 కేసులు వచ్చాయని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డెంగీ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాల్లో ఇంటింటికీ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మంత్రి హరీశ్రావు కలెక్టర్లకు సూచించారు.

డెంగీ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు, బ్లడ్ ప్లేట్లెట్స్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందేవిధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన ఆహార పదార్ధాలు మాత్రమే వినియోగించాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రతి వారం రెసిడెన్షియల్ పాఠశాలలో ఫాగింగ్ చేపట్టాలని, కిచెన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి హరీశ్రావు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందించాలని, ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వేశామని మంత్రి తెలిపారు. 26 ఆగస్టు 2022 నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 వయస్సు గల విద్యార్ధులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Exit mobile version