end

లాక్‌డౌన్‌ దిశగా ఢిల్లీ..!

కరోనా వైరస్‌ విజృంభించి నిన్నటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మహమ్మారి రోగం ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తూనే ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూపులు కొనసాతున్నాయి. కోవిడ్‌ విసిరిన పంజాతో అగ్రరాజ్యం అమెరికా కుదేలైంది. యూరప్‌ దేశాల్లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ దడ పుట్టిస్తూ ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో థర్డ్‌ వేవ్‌ బెంబేలెత్తిస్తోంది. దీంతో కేజ్రీవాల్‌ సర్కారు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. పంట వ్యర్థాలు కాల్చడానికి తోడు పండుగ రోజులు తోడు కావడం, ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. అక్టోబర్‌ చివరి వారం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మినహా మరో మార్గం లేదని భావిస్తున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. జన సాంద్రత ఎక్కువ ఉండే మార్కెట్లను మూసివేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. అంతేకాదు వివాహాలు, వేడుకలకి 200 మంది వరకు హాజరు కావచ్చునన్న నిబంధనల్ని మళ్లీ మార్చేశారు. పెళ్లిళ్లకి 50కి మించి హాజరు కాకూడదని మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన మీడియా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఉధృత రూపం దాల్చుతోంది. ప్రజలెవరూ మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. అందుకే రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ విధించడం తప్ప మా ముందున్న మరో మార్గం లేదు. ఈ మేరకు కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు పంపాము. కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరిస్తే ఎప్పుడైనా లాక్‌ డౌన్‌ విధిస్తాం. ఇప్పటికే నగరంలో కోవిడ్‌–19 హాట్‌ స్పాట్‌లను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.

కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. అక్టోబర్‌ 28న వాటి సంఖ్య 3,113 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 4,430కి చేరుకుంది. శీతాకాలంలో ఢిల్లీలో రోజుకి 15 వేలకు పైగా కేసులు నమోదవుతాయని అంచనాలున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు రోజుకు లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నామని, ఐసీయూ బెడ్లను 6 వేలకు పెంచినట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది.

Exit mobile version