end

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖ నేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి(80) అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. గత కొన్ని రోజులుగా నాయిని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాయిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యూమోనియాగా తేల్చారు.

కాగా, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 13న కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. ఆస్పత్రికి వెళ్లి ఆయనను చూసి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కాగా, నాయిని మృతి పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమ నేతగా, కేసీఆర్‌తో జతకట్టిన ఆయన.. కార్మిక నేతగా మంచి గుర్తింపు సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేశారన్నారు. నాయిని మృతి పట్ల ప్రముఖుల నుంచి సాధారణ కార్యకర్తలు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు.

Exit mobile version