దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే విభాగాలను బలోపేతం చేసే దిశగా పోలీసు, విపత్తుల నిర్వహణ శాఖలకు అధునాతన వాహనాలు సమకూర్చినట్లు చెప్పారు. రాష్ట్ర పోలీసు శాఖకు 36 తుఫాన్ జీపులతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకు 14 ఫైరింజన్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో గురువారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు.
క్షేత్రస్థాయిలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను అందజేస్తున్నామని చెప్పారు. రేడియో పరికరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, నెట్‌వర్క్ వీడియో రికార్డింగ్ సహా పలు సదుపాయాలు కొత్త వాహనాల్లో ఉన్నట్లు తెలిపారు. ఏ ఘటన జరిగినా ప్రత్యక్షంగా కంట్రోల్ రూం నుంచి వీక్షించి అదనపు బలగాలను పంపడానికి అవకాశం ఉంటుందన్నారు. దిశ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి పోలీసుశాఖకు 700వాహనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.