end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సాహిత్యంఅసలేం జరిగిందంటే
- Advertisment -

అసలేం జరిగిందంటే

- Advertisment -
- Advertisment -

ఆ దృశ్యం నా కంటపడగానే చకితుణ్ణయిపోయాను. 
మార్నింగ్‌ వాక్‌కని బయలు దేరాను. నాకు తెలియకుండానే, ఆ శవాన్ని దాటి… ‘శవం’ అన్న పదాన్ని వాడటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. 
రోడ్డు ప్రక్కన ఫుట్‌పాత్‌పైన నిద్రపోతున్నట్టు పడున్న ఆ అందమైన వ్యక్తిని శవం అని ఎలా అనను? ప్రమాద సూచనలేవీ లేవే? గాయాలూ, నెత్తురూ ఏమీ కనిపించటం లేదు. ఎలా చచ్చివుంటాడు? గుండె ఆగిపోయి వుంటుంది. పాపం! ఆట్టే వయసు కూడా లేదు. భార్యాపిల్లలు వుండే వుంటారు. అక్కడో క్షణం కూడా నిలవలేకపోయాను.
దారిలో కాఫీ హోటల్‌ కనిపించింది. నేను తప్ప మరెవ్వరూ లేరు. కూచుని ఆర్డరిచ్చాను. ఇంతలోకి ఇద్దరు, దంపతులు గామాల్ను, వచ్చారు.
‘‘అది ముమ్మాటికి హత్యే’’ అంటున్నాడు అతను.
‘‘మీ మాటే మీకా? నడి బజారులో హత్యేవిటండీ?’’
‘‘వండర్‌ఫుల్‌. ‘నడిబజారులో హత్య’. అద్భుతంగా వుంది టైటిల్‌.’’
‘‘ఆ వెధవ డిటెక్టివ్‌ పుస్తకాలు చదువుతూంటం వల్లే మీ మతి ఇలా చలించిపోతోంది.’’
‘‘అన్నన్నా! ఎంతమాటన్నావు? వేటర్‌… రెండు కాఫీ. అవి ఎంత గొప్ప గ్రంథాలో నీకేం తెలుసు? దృష్టి ఇట్టే విశాలమైపోతుంది.’’
‘‘అవును విశాలమైపోయి ప్రపంచమంతటా హత్యలూ, హంతకులే కనిపిస్తుంటారు. ఆ మనిషి ఎవరో పాపం, చెక్కు చెదరకుండా పడివుంటే హత్య అంటకడతారే?’’
‘‘పిచ్చిదానా, హత్య అంటే పిస్తోలుతో కాల్చటమో, కత్తితో పొడవటమో అనుకుంటున్నావు. హత్య కూడా అతి సున్నితమైన కళగా మారిపోయిందని నీకింకా తెలీదు గామాల్ను. ఈ రోజుల్లో ఒక చిన్న షాట్, అంటే ఇంజక్షన్‌ చాలు. మనిషన్నవాడు చెక్కు చెదరకుండా చచ్చివూరుకుంటాడు.’’
‘‘ఆ ఇంజక్షనిచ్చిన డాక్టరెవరో?’’
‘‘అంటే హంతకుడెవరో చెప్పమంటున్నావు, నాకేం తెలుసు? నువ్వే కావచ్చు.’’
‘‘నేనా?’’ ఆశ్చర్యపోయింది ఆవిడ.
‘‘ఆ శవం దగ్గర ఒక్క అయిదు నిమిషాలు పరిశోధించి వుంటే బోలెడన్ని క్లూలు దొరికేవి. ఏదీ, నువ్వు నిలువనిస్తేగా?’’
‘‘అపరాధ పరిశోధక మహాశయా! ఇప్పుడెళ్లి ఆ క్లూలేవిటో వెతుక్కోండి. నే నింటికెళ్తాను.’’
‘‘ఇంతవరకూ క్లూలు కూచున్నాయేవిటి? మాయం చేసెయ్యరూ?’’
‘‘వాళ్లెవరూ?’’
‘‘ఆ దొంగముఠావాళ్లు.’’
‘‘హంతకుల్లోంచి దొంగల ముఠాలోకి దిగారేవిటి?’’
‘‘దొంగలంటే దోపిడీ దొంగలేం కాదు, దొంగనోట్లు తయారుచేసే ముఠా.’’ 
కాస్త తగ్గుస్వరంతో మొదలెట్టాడు అతను. ‘‘ఆ చచ్చిపోయిన అభాగ్యుడు కూడా ఆ ముఠాకు చెందినవాడే. నాయకునితో ఏవో స్పర్థలొచ్చాయి. విడిపోతాననీ, పోలీసులకి ఆచూకీ ఇస్తాననీ బెదిరించాడు. ఇంకేముందీ, ముఠా నాయకుడు సిగ్నల్‌ ఇచ్చాడు. అతని అనుచరులు పది నిమిషాల్లో పని పూర్తిచేశారు.’’
‘‘ఎందుకండీ, లేనిపోనివన్నీ కల్పిస్తారు. అది హత్య ఎంతమాత్రం కాదు, ఆత్మహత్య.’’
‘‘అదెవ్వరు చెప్పారు?’’
‘‘నా అంతరాత్మే చెబుతోంది. హృదయమున్నవాళ్లు అతని ముఖంకేసి ఒక్క క్షణం చూస్తే చాలు అంతా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది.’’
‘‘ఏవిటో అది?’’
‘‘వినండి. అతనొక కవి, గాయకుడు, చిత్రకారుడు… అతని గానం విని ఆనంద సాగరంలో మునిగి పోయేవారు, అతను గీసిన చిత్రాలను చూసి మంత్రముగ్ధులై పోయేవారూ అనేకులు. వారిలో ఆ అమ్మాయి కూడా ఒకర్తె. అందాల రాశి. చూపులు కలియగానే హృదయాలు పెనవేసుకుపోయాయి. కాని అతను నిరుపేద, ఆమె ఒక ధనవంతుని గారాల కూతురు. తన ఏకైక పుత్రిక కోరిక కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నాడు తండ్రి. కాని అదొక ఎత్తు. కూతురు చదువు వంకబెట్టి పెళ్లి రెండేళ్లు వాయిదా వేశాడు. ఈ లోపున అతని చిత్రలేఖనానికి మెరుగులు దిద్దే మిష మీద శాంతినికేతన్‌లో చేర్పించాడు. కొన్నాళ్లకు అతను ప్రమాదవశాత్తూ హుగ్లీ నదిలో పడి కొట్టుకుపోయినట్టు ఒక టెలిగ్రాం కల్పించి తెప్పించాడు. అతని ఉత్తరాలు కూతురికి అందకుండా కట్టుదిట్టం చేశాడు. మరి కొన్నాళ్లకు కూతురి గుండె గాయం మానిందన్న ధైర్యం రాగానే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఎలాగో వొప్పించాడు. అటు అతను తన ఉత్తరాలకు జవాబులు రాక తల్లడిల్లిపోయి స్వయంగా బయలుదేరాడు. రైలు దిగేసరికి చీకటి పడ్డది. తిన్నగా ఆ ధనవంతుని ఇంటికి దారితీశాడు. దోవలో ఊరేగింపు ఎదురైంది. బాజాభజంత్రీలతోనూ, లైట్లతోనూ, బాణాసంచాతోనూ వెళ్తోన్న పెళ్లి ఊరేగింపు. అప్రయత్నంగా అతని దృష్టి ఆ నవదంపతుల కారువైపుకు పోయింది. గుండె ఆగినట్టనిపించింది. ఎలుగెత్తి అరవబోయాడు. కాని శోష వచ్చి పడిపోయాడు. తెలివి వచ్చేసరికి అంధకారం. ఆ చీకట్లో చేతికున్న వజ్రపుటుంగరం మెరిసింది. ఆమె కానుక అది. వెంటనే ఆ వుంగరాన్ని మింగేశాడు. అక్కడే వొరిగిపోయాడు.’’
‘‘కట్‌… ఆ ఆఖరు సీను నాకు నచ్చలేదు. ఈనాటి యువతరం చెయ్యాల్సిన పనికాదది. అంతకంటే ఒక పిస్తోలు సంపాదించి, ఆ ధనవంతుణ్ణి కాల్చి చంపి, కోర్టులో ధనవంతులు చేసే అన్యాయాల మీద ఉపన్యాసం దంచి, ఉరికంబం ఎక్కివుంటే ఎలా వుండేది?’’
‘‘క్షమించాలి. అక్కడ ఫుట్‌పాత్‌ పైన చచ్చిపడివున్న వ్యక్తిని గురించే కదూ మీరు మాట్లాడుకుంటోంది’’ అంటూ ఒకతను దంపతుల దగ్గరికి వచ్చాడు. మొహం ఎక్కడో చూసినట్టే వుంది.
‘‘ఆశ్చర్యపోకండి… మీరా వ్యక్తి గురించి అనుకుంటున్నదేదీ నిజంకాదని చెబుదామని.’’
‘‘మీరూ?’’
‘‘నే నెవరైతే ఏంలెండి. అసలేం జరిగిందో చెబుతాను. ఈ కుర్చీలో కూచోనా?’’
‘‘ఓ, దానికేం’’ అంటూ ఆహ్వానించాడు భర్త. భార్య ఇంకా అనుమానంగానే చూస్తోంది.
‘‘అది హత్య కాదు, ఆత్మహత్యా కాదు. అతని మరణానికి కారణం దొంగనోట్లూ కావు, ప్రేమా కాదు. అతని అందం.’’
‘‘అందమా?’’ దంపతులు నోరెళ్లబెట్టారు.
అతను జేబులోంచి ఒక ఖరీదైన పాకెట్‌ తీసి, ముందు భర్తకు ఆఫర్‌ చేశాడు. భర్త చెయ్యి ముందుకు పోనిచ్చి, భార్యను చూసి వెనక్కి తీసుకున్నాడు. అతను సిగరెట్‌ వెలిగించి, చెప్పుకుపోయాడు.
‘‘అసలతను ఎవరో, ఎక్కడివాడో ఎవరికీ తెలీదు. పెద్దపెద్ద హోటళ్లలోనే నివాసం చేస్తాడు. రకారకాల కార్లలో షికారు కొడుతుంటాడు. వెంట ఒకరో ఇద్దరో అందమైన ఆడవాళ్లు అంటివుంటారు. ఇదంతా ఎలా సాగుతోందో తెలీదు. కాని అతని అందాన్ని అమ్ముకుని బ్రతుకుతాడని ప్రతీతి.’’ భార్యాభర్తల కళ్లు మరీ పెద్దవైనాయి.
‘‘మగవాళ్లల్లో కూడా కొందరికి తమ అందాన్ని అమ్ముకునే అవకాశాలు లేకపోలేదు ఈ ప్రపంచంలో. ఈ మధ్యే ఒక డబ్బుగల వితంతువుకు అతనిపైన మోజు కలిగింది. నిన్న రాత్రి ఇద్దరూ పట్నానికి పది మైళ్ల దూరంలో వున్న ఒక రహస్య స్థలానికి వెళ్లారు. తిరిగి బయలుదేరేసరికి మూడు దాటింది. హైరోడ్డుకు రావడానికి మూడు మైళ్ల అడ్డదారి. అన్నీ ఎత్తుపల్లాలు. బాగా వొరిగి నిద్రపోతున్నాడనుకున్నది. కానీ కెవ్వున కేకేసింది. తన అనుమానం డ్రైవర్‌కు చెప్పింది. భయంతో వణికిపోయింది. డ్రైవర్‌ ధైర్యం చెప్పాడు. కాస్త చీకటిగా వున్నచోట ఆపి, శవాన్ని లాగి, ఫుట్‌పాత్‌పైన పడుకోబెట్టారు’’ అని ఆగిపోయాడు.
‘‘మరి అతను ఎలా చచ్చాడు?’’
‘‘మీకు తెలుసో లేదో, మనిషి మెదడుకీ వెన్నెముకకీ కొన్ని నరాల ద్వారా సంబంధం ఉంటుంది. దాన్నే మెడిల్లా అబ్లాంగేటా అంటారు. ఏ విధంగానైనా ఆ సంబంధం తెగిపోతే మనిషి వెంటనే ప్రాణాల్ని కోల్పోతాడు. ఉరి తీయటంలో అదే జరుగుతుంది. అంటే అతని చావుకు కారణం అడ్డదారిలోని ఎత్తుపల్లాల కుదుపులన్నమాట. ఇదీ సంగతి, శలవు’’ అంటూ లేచాడు. వీధిలోని రిక్షాను కేక వేసుకుంటూ వెళ్లిపోయాడు. దంపతులు ఒహరి మొహాలు ఒహరు చూసుకుంటూ కూచుండిపోయారు.
నేను ఆ అపరిచిత వ్యక్తిని వెతుక్కుంటూ వీధిలోకి వెళ్లాను. అప్పటికే రిక్షా ఎక్కబోతున్నాడు.
‘‘ఒక్కమాట. నేనూ ఆ శవాన్ని చూసినవాణ్ణే. మీరిందాక చెప్పింది నమ్మమంటారా?’’
పెద్దగా నవ్వాడు. ‘‘ఆ దంపతులు చెప్పింది వినేవుంటారుగా. వాళ్లని నమ్మగలిగితే, నే చెప్పిందీ నమ్మొచ్చు.’’
‘‘అంతేనంటారా?’’
‘‘అతను డిటెక్టివ్‌ నవలలు చదివీ, ఆమె సినిమాలు చూసీ తమ వూహాకల్పనలు చేశారు. నేనూ ఒక పోగు వేశాను.’’
‘‘అదేదీ నిజంకాదని మీరెలా అనగలరు?’’
‘‘మీరు నన్ను ఇంకా పోల్చుకోలేదా? ఆ శవాన్ని నేనే. పోనీవోయ్‌ రిక్షా’’ అంటూ ఎక్కి కూచున్నాడు.
‘‘అరెరే, ఆగండి. అసలేం జరిగిందో చెప్పరూ?’’
‘‘వడ్లగింజలోనిదే బియ్యపుగింజ. నేను కథలు రాస్తాను. రాత్రి ఒక ప్లాటు కోసం ఎంత ఆలోచించినా దొరకలేదు. తెల్లవారు ఆలోచిస్తూ నడుస్తుంటే నా కాలు అరటితొక్కపైన పడింది. జారి పడిపోయాను. రాత్రి నిద్రలేనందువల్లనేమో తెలివి తప్పిపోయాను. తెలివి వచ్చేసరికి చుట్టూ జనం మూగివున్నారు. నేను చనిపోయాననే అనుకున్నారట. లేచి, తిన్నగా కాఫీహోటల్‌ చేరుకున్నాను. ఆ దంపతుల కథలు విన్నాను. నా కథ కూడా జోడించాను’’ అంటూ చక్కా వెళ్లిపోయాడు.
ఆ కొత్త కథ కూడా నిజం అవునో కాదో తేల్చుకోలేక అక్కడే నిల్చుండి పోయాను.

నెల్లూరు కేశవస్వామి కథ ‘అసలేం జరిగిందంటే’కి సంక్షిప్త రూపం ఇది. కేశవస్వామి (1920–1984) 
హైదరాబాద్‌లో జన్మించారు. నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా పనిచేశారు. చార్మినార్, పసిడి బొమ్మ వీరి కథాసంపుటాలు. చార్మినార్‌ సంపుటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వెలుతురులో చీకటి వీరి నవల. హైదరాబాద్‌లోని ముస్లింల జీవితాన్ని తన కథల్లో వరుసగా, స్థిరంగా పరిచయం చేసిన రచయిత. హైదరాబాద్‌ విమోచన నేపథ్యంలో రాసిన యుగాంతం ఆయన కథల్లో ఒకటి. కొన్ని ప్రేమ్‌చంద్‌ కథల్ని అనువదించారు. 
ఈ యేడాది కేశవస్వామి శతజయంతి సంవత్సరం. 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -