ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేదు. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నది. మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంగళ్ రావు నగర్ లోని IIFH నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మంకీ పాక్స్ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు దాదాపు 60 పైగా దేశాల్లో 12 వేల దాకా కేసులు నమోదైనప్పటికీ, మన దేశంలో కేరళలో ఒక కేసు మాత్రమే నమోదు అయిందన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలతో ఉన్నవారు కూడా రాలేదని చెప్పారు.
కేసులు నమోదుకాకపోయినా మంకీ పాక్స్ పట్ల వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల గురించి తెలుసుకుంటూ, డబ్ల్యూహెచ్వో, ఐసిఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానిత కేసులకు తక్షణ చికిత్స అందించేందుకు నోడల్ ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రిని ఎంపిక చేసినట్టు చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గాంధీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం, పాజిటివ్ వస్తే నిర్ధారణ కోసం నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానం పట్ల వైద్యులందరు అవగాహన పెంచుకోవాలని, క్షేత్ర స్థాయి సిబ్బందికి వివరించాలని మంత్రి సూచించారు. వైరస్ కు సంబంధించిన అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు ఐసొలేషన్‌లో ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 సంపాదించాలని ప్రజలకు సూచించారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త..
వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, రాబోయే వారం పది రోజులు అన్ని ఆసుపత్రిలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఓపి సమయాన్ని పెంచి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సూపరిండెంట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలన్నారు. పేషెంట్లకు మంచి వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు 24 గంటలు పని చేయాలని ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డైట్, శానిటేషన్ టెండర్లు దాదాపు అన్ని ఆసుపత్రుల్లో పూర్తయ్యాయని, కాబట్టి మంచి డైట్ అందించడంతోపాటు శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కొత్త డైట్ మెనూను ప్రతి ఆసుపత్రుల్లో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. AML/EML లో మందుల సంఖ్యను 843 కి పెంచుకున్నామని, బయటికి మందులు రాయకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్ లకు సూచించారు. కొత్త మందుల జాబితా గురించి పీజీ, ఎస్ ఆర్ లకు తెలియజేయాలన్నారు.
అర్హులందరికీ బూస్టర్ ఇవ్వాలి…
18 ఏళ్లు దాటి, రెండో డోసు వేసుకొని 6 నెళ్ళు పూర్తయిన వారికి బూస్టర్ డోసు అందించాలని మంత్రి ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.