సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిల్డింగ్ పైనున్న రూబీ లాడ్జ్(Ruby lodge)లో ఉన్న వారిలో 8మంది మృత్యువాత పడ్డారు.ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండచ్చు. మరోపదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుస క్రమం లో ఉండటం తో ఒకటి పేలాగానే మిగిలిన వాటికి మంటలు వ్యాపించి పేలడంతో సికింద్రాబాద్ ప్రాంతంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి.చూస్తుండగానే అంతలోనే దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి.ఏం జరుగుతుందో తెలిసే లోపే కొంతమంది అగ్నికి బలియ్యారు.
రైల్వేస్టేషన్(Railway Station) రోడ్డులో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం(Passport Office) వద్ద రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో ఐదంతస్తుల భవనం పై అంతస్తులో లాడ్జి ఉండగా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ఉంది. నిన్న రాత్రి 9గంటల తర్వాత షో రూమ్ గోడౌన్ షార్ట్ సర్క్యూట్ అయి స్కూటర్ పేలింది. దాని మంటలు చూస్తుండగానే పైన ఉన్న లాడ్జీకి వ్యాపించాయి. ఆ సమయంలో 25 మంది హోటల్లో ఉన్నారు.
ఈ భవనానికి లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే దారి ఉంటుంది. అందుకే ప్రమాదంలో ఎక్కువ మంది మంటలకు గురి కావాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఈ కారణం చేతనే మంటల్ని త్వరంగా ఆపేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. షోరూం గోదాములో ఈ స్కూటర్లను పార్క్ చేస్తారు. అక్కడ స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్ చేస్తుంటారు. అక్కడే షార్ట్ సర్క్యూట్(short circuit) జరిగి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్(KTR) మూడు లక్షలు ప్రకటించారు.