end

రిషభ్‌ బాగా ఆడినా.. నా కేరీర్‌కు ప్రమాదం లేదు

  • టీమిండియా వికెట్‌కీపర్‌ సాహా

ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్‌ మినహా టీ20, టెస్టు సిరీస్‌లను 2-1, 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టు సిరీస్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మినహా.. మిగితా అన్ని టెస్టుల్లోనూ టీమిండియా జోరు కనబరిచింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తన స్థానాన్ని కోల్పోయాడు. అనంతరం జట్టులోకి యువ సంచలనం రిషభ్‌ పంత్‌ వచ్చాడు. పంత్‌ ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. తన పట్టుదల, ఆటతీరుకు క్రీడా విశ్లేషకులు, అభిమానులు ముగ్ధులైపోయారు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఇక సిరీస్‌ విజయాన్ని నిర్ణయించే కీలకమైన బ్రిస్బేన్‌ టెస్టులో గాబా స్టేడియంలో భారీ లక్ష్యాన్ని సైతం టీమిండియా ఉఫ్‌ మనిపించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ 91 పరుగులతో జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. అనంతరం టీమిండియా నయావాల్‌ పుజారా చక్కటి అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఇక కీలక దశలో వికెట్లు కోల్పోతున్నా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి పంత్‌ 89 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్‌ 2-1తో భారత్‌ వశమైంది. భీకరమైన ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. బుల్లెట్లలా దూసుకొస్తున్న బంతుల్ని, దెబ్బలు తగిలినా.. గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు పోరాడారు. చివర్లో పంత్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. దీంతో అతడికి దేశమంతా ప్రశంసలు వెల్లువెత్తాయి. క్రికెటర్లు సైతం పంత్‌ను పొగడ్తల్లో ముంచారు. టీమిండియా వచ్చే నెల్లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు పంత్‌ వికెట్‌ కీపర్‌గా సెలెక్ట్‌ అయ్యాడు.

కాగా, ఆస్ట్రేలియాలో పంత్‌ విజయవంతమవ్వడం తనకు కూడా ఆనందాన్నిచ్చిందంటున్నాడు సాహా. తన సహచరుడు అంత బాగా పర్ఫామ్‌ చేసినప్పుడు ఎవరు మాత్రం సంతోషించరు. అంతిమంగా జట్టు విజయమే కావాల్సింది. పంత్‌ బాగా ఆడినా తన కేరీర్‌కు వచ్చే నష్టమేమి లేదంటున్నాడు వృద్ధిమాన్‌. ఎవరికి ఎప్పుడు అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకుంటే చాలంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌.

Exit mobile version