- చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఘటన
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై గుడిపల్లి గ్రామ సమీపంలో జరిగింది. చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప (65)కు డయాలసిస్ చేయించేందుకు తన కొడుకు కాంతప్ప(43) గురువారం ఉదయం కారులో పీఈఎస్ ఆసుపత్రికి వచ్చి చికిత్స అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో గుడిపల్లి సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి కారును చాలా గట్టిగా ఢీకొట్టడంతో తండ్రి సుబ్బప్ప, కుమారుడు కాంతప్ప అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరుగగానే భయపడిన బస్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.