ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంపు కోసం ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన ఆడిట్ రిపోర్టులపై ఎఫ్‌ఆర్‌సీ పరిశీలన తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజుల పెంపు పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అసలు దీనికి సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ ద్వారా అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు.
రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని మంత్రి సబితా పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ. 45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు రేకెస్తున్నాయి.