న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా 87 ఏళ్లలో తొలిసారిగా రంజీ ట్రోఫీకి బ్రేక్ పడింది. 2020-21 సీజన్ రంజీ ట్రోఫీకి బదులుగా 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. రాష్ట్ర సంఘాల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు బోర్డు తెలిపింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు రంజీ నిర్వహణకు మొగ్గుచూపినా.. రెండు నెలలపాటు ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచడం కష్టమని భావించారు.
దేశవాళీల్లో విజయ్ హజారే, మహిళల జాతీయ వన్డే టోర్నమెంట్‌తోపాటు అండర్-19 ఆటగాళ్ల కోసం వినూమన్కడ్ ట్రోఫీని కూడా నిర్వహించనున్నట్టు రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో షా తెలిపారు. అన్ని టోర్నీలనూ బయోబబుల్‌లోనే నిర్వహించనున్నారు. వచ్చే నెలలో విజయ్ హజారే ట్రోఫీని షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. కాగా, బోర్డు నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్వాగతించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో 38 జట్లతో నాలుగు రోజుల మ్యాచ్‌లు సహేతుకంగా అనిపించడం లేదని ట్వీట్ చేశాడు.