జాతీయ పార్టీ అయిన బీజేపీ తాజాగా రాష్ట్రంలో తన బలం పుంజుకుంటోంది. ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్‌లో ఘనవిజయం సాధించిన కమలం పార్టీ.. గ్రేటర్ ఎలక్షన్‌లో తమ సత్తా చూపించాలని చూస్తోంది. అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బీజేపీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఈమె కాంగ్రెస్ హయాంలో మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ కూడా మేయర్ పీఠమే లక్ష్యంగా దూసుకుపోతోంది.
ఇటీవల కార్తీక రెడ్డితో బీజేపీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆమె కమలం కండువా కప్పుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే సీటు ఆశించినా ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో, అలాంటి ఎదురుదెబ్బ తగలకూడదని బీజేపీతో పకడ్బందీ ఒప్పందం కుదుర్చుకున్నాకే ఆమె పార్టీలో చేరడానికి సిద్దమైంది.