నకిలీ రెండు వేల నోట్లతో చీటింగ్ చేయడానికి ప్రయత్నించిన ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.500 నోటు ఇస్తే రూ.2000 నోటు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని చీటింగ్ చేయడానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నానికి చెందిన నలుగురు వ్యక్తులు , అలాగే కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన మరో వ్యక్తి కలిసి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్‌లో ఉంటున్న చలగళ్ళ నాగప్రసాద్‌కు ఫోన్ చేశారు.
తమ వద్ద రూ.2 వేల నోట్ల కట్టలు మొత్తం కోటి రూపాయలుఉన్నాయని, రూ.500 నోట్లు కావాలని నమ్మబలికారు. ఇదేగాకుండా రెండు కట్టలను ఫోటులు, వీడియోలు తీసి నాగప్రసాద్‌కు వాట్సాప్‌లో పంపించి అతను నమ్మేలా చేశారు. అయితే మొత్తం 90 లక్షలు తీసకువస్తే దానికి బదులుగా 10 లక్షలు ఎక్కువ అంటే రూ. కోటి ఇస్తామని, డబ్బులు తీసుకొని నాగమల్లి జంక్షన్ వద్దకు రావాలని కోరారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతుండడంతో నాగప్రసాద్‌కు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్‌కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
ఎస్.బి.ఐ బ్యాంకులో చోరికి యత్నం
పోలీసుల ఎన్‌కౌంటర్ – మావోయిస్టు హతం