end

కొత్త సంవత్సరం నుంచి వారికి ఉచిత కరెంట్‌

నూతన సంవత్సరం నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కమ్‌లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌కు నివేదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నాయి. డిసెంబరు నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లు/లాండ్రీలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. ఇప్పటికే 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితంగా సరఫరా చేయడానికి అవసరమైన కసరత్తును పూర్తి చేసింది.

తాజాగా మరో కీలక ఎన్నికల హామీని తీర్చడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఈ ప్రకటనకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఆయన ఆమోదించాక ప్రకటన వెలువడనుంది. వాస్తవానికి ఎన్నికల ముందు ప్రతీ నెల 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ను సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఇవ్వడానికి ఓ ప్రతిపాదన సిద్ధమయింది. ఆ తర్వాత దానిని పక్కనపెట్టారు. తాజాగా ఏయే ప్రాంతాల్లో ఏయే సెలూన్లు ఎంత మేర విద్యుత్‌ను వినియోగిస్తున్నాయో వివరాలను సేకరించారు.

ఉచిత జాబితాలోకి క్షురక, రజక వర్గాలు
ఇప్పటికే 24 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంట్‌ ఇస్తుండగా… 101 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. తాజాగా క్షురకులు, రజకులు కూడా ఈ జాబితాలో చేరనున్నారు. అయితే కొత్త వర్గాలకు ఎన్ని యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నారనేది సీఎం తెలపాల్సింది.

Exit mobile version