వైఎస్సార్ కడప: మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు 48 గంటలు డెడ్‌లైన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన ప్రెస్‌మీట్‌లు కామెడీ షోలా తయారయ్యాయని, అలాంటి వాటిని ఎల్లో మీడియా హైలెట్ చేసి చూపిస్తున్నాయన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జగన్ మాదిరిగా చంద్రబాబు కూడా రాజీనామా చేసి ముందుకు రావాలని సవాలు చేశారు.
అమరావతి రైతుల క్షేమం కోసం శ్రీశైలం ప్రజల త్యాగం
రాజధాని గురించి ఎన్నికల ముందు చెప్పలేదని బాబు అంటున్నారని కానీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబుకు రాయలసీమ వచ్చి మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి హైకోర్టును వద్దని చెప్పగలుగుతారా? అని నిలదీశారు. బినామీలు కాపాడుకునేందుకు అమరావతి అంటూ డ్రామాలు ఆడుతున్నారని బాబును విమర్శించారు. ఇకనైనా రాయలసీమ టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రజలు బాగున్నారు అంటే అది శ్రీశైలం పరిసర ప్రాంతాల ప్రజల త్యాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సెంటిమెంట్ మీకు గుర్తుకు రాదా? అని ప్రశ్నించారు.
బాబుకు మంచి చేయాలన్న ఆలోచనే రాదు
ఇలానే చంద్రబాబు డ్రామాలు అడితే రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి మరీ ప్రజలు ఆయన ఇంటిని చుట్టముడతారని హెచ్చరించారు. బాబుకు సిగ్గు, శరం ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కేవలం గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మాణం చేసిన ఆయనకు మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. ఇది “రాజన్న రాజ్యం – రైతు రాజ్యం” అని, ఏ రైతు కంట కన్నీరు రానివ్వమని భరోసా ఇచ్చారు. అమరావతి రైతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని శ్రీకాంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.