end

శ్రీశైలం లో 6, 7, 8 నంబర్ల గేట్ల ఎత్తివేత

  • భారీ వర్షాలకు నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు
  • మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేసిన మంత్రి అంబటి
  • గేట్లు ఎత్తడం గత 12 ఏళ్లలో ఇది మూడోసారి

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో ఈరోజు ఉదయం మూడు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11:30 గంటల సమయంలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజల అనంతరం మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టు 6, 7, 8 నంబర్ల గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. గడిచిన 12 సంవత్సరాలలో జులై నెలలో శ్రీశైలం గేట్లు ఎత్తివేయడం ఇది మూడోసారి. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టుకు 1,27,980 క్యూసెక్కుల నీరు వస్తుండగా 74,365 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులతో నిండుకుండలా మారింది. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులో 882 అడుగుల్లో నీటిని నిల్వ చేసి మిగిలిన నీటిని స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం నుంచి వదిలిన నీరు నాగార్జనసాగర్‌కి చేరుకుంటుంది.

శ్రీశైలం ప్రాజెక్టు ఎత్తడంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. అక్కడి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గంట లోనే వేలాది మంది శ్రీశైలానికి వచ్చారు. గేట్లు ఎత్తుతారన్న సమాచారం ఉండటంతో పర్యాటకులు ఇప్పటికి వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version