- ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ
- అల్లూరి పాత్రతో తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయం
తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్(James Bond) సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్.. సరికొత్త సాంకేతికతలు పరిచయం చేసి సంచలనాలు సృష్టించడంలో మొనగాడు.. అలనాటి హేమాహేమీలకు దీటుగా సినిమాలు నిర్మించిన మొండి ఘటం.. సాహసమే ఊపిరిగా ముందడుగు వేసిన ధీశాలి.. 350కి పైగా చిత్రాల్లో నటించడమే కాక నిర్మాతగా, దర్శకుడి(Director)గా రాణించి ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న సినీ దిగ్గజం ‘ఘట్టమనేని కృష్ణ’. ఎన్నో సినిమాల్లోని పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన కృష్ణ.. అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju)గా వెండితెరపై జీవించిన తీరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఇలాంటి ఎన్నో మైలురాళ్లను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.
తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ(పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) ఇక లేరు. 1970, 80ల్లో భారీ ఎత్తున ప్రజాదారణ పొంది సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతిగాంచిన ఆయన.. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ 1964-65లో వచ్చిన ‘తేనెమనసులు(Tene Manasulu)’తో హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడో చిత్రం ‘గూఢచారి 116’తో పరిశ్రమలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాలు చేసిన ఆయన.. 1970లో నిర్మాణ సంస్థ ‘పద్మాలయా సంస్థ’ను ప్రారంభించి పలు విజయవంతమైన(Successful) చలన చిత్రాలను నిర్మించడంతోపాటు దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.
ముఖ్యంగా కృష్ణ నటించిన తొలి కౌబాయ్(Cowboy) సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి ఫుల్‌స్కోప్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’ వంటివి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ మైలు రాయిగా నిలిచిపోయాయి. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్(Super Hit) సినిమాలున్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు సగటున పదేళ్ళకు వంద సినిమాలు(100 Movies) అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేయడం విశేషం.
(Sitara:సితారను ఓదార్చేదెవరు..)
అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా నిలిచిన కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. దీంతో 1984 నుంచి కాంగ్రెస్(Congress) సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగానూ గెలుపొందాడు. అలాగే 90వ దశకం వరకూ విపరీతమైన బిజీ షెడ్యూల్ కారణంగా కొన్నేళ్లపాటు మూడు షిఫ్టులుగా పనిచేసేవాడు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక మూడవ షిఫ్ట్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలున్నాయి. ఇక కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రెండవ భార్య విజయనిర్మల(Vijaya Nirmala) 2019లోనే కన్నుమూసింది. కొడుకులు మహేష్ బాబు, రమేష్ బాబు, కూతురు మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు ఆయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినవారే. కాగా 2010 నుంచి నటన జీవితం, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకుగాను 1997లో ‘ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం’ 2003లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ , 2008లో ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్’ 2009లో ‘పద్మభూషణ్ పురస్కారం(Padma Bhushan Award)’ లభించాయి.