తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు 50 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ ప్రభావంతో అప్పుడు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినందుకు గాను అలా చేయాల్సి వచ్చింది. కాగా, అప్పుడు వారి జీతంలో తగ్గించిన మొత్తం అమౌంట్‌ను తిరిగి వారికి చెల్లించాలని సీఎం నిర్ణయించారు. వీటి కొరకు దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై కూడా త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
ఈ మేరకు ఆదివారం ఆర్టీసీ అధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్(10 లక్షలు) దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్అ భినందించారు. ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సులను నడపాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు నగరంలో కేవలం 25 శాతం మాత్రమే బస్సులు నడుపుతున్నారు.