హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. సికిందరాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, మల్కాజ్‌గిరి, ఉప్పల్, బేగంపేట, కోఠి, బోయినపల్లి, హిమాయత్‌నగర్, నాంపల్లి, నారాయణగూడ, చందానగర్, బాలానగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ఆపై బలమైనగాలులు వీయడంతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్‌ను ఆపివేశారు. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని జిహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు.
రెండురోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ర్టంలో రాబోయే 48 గంటలు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవనసరంగా ఇండ్ల నుండి బయటకు రావొద్దని హెచ్చరించారు.