కర్ణాటక, మహారాష్ర్టలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండే వాతావరణంలో మార్పులు కనబడ్డాయి. పొగమంచుతో ఓ మాదిరి ముసురు కమ్ముకొని ఉంది. అయితే సాయంత్రం 5 గంటల నుండి భారీగా వర్షం పడింది. సికిందరాబాద్ ఏరియాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, ట్యాంక్‌బండ్, కవాడిగూడ, అశోక్‌నగర్, ఆర్టీసి క్రాస్‌రోడ్స్, విద్యానగర్, రాంనగర్, అలాగే పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో వర్షం బాగానే పడింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అసలే చలి ఇంకా ఆపై వర్షం పడడంతో ప్రజలు వణికిపోతున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.