రాజ్యగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. 16వ రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరగనుంది. జులై 21 ఎన్నికల ఫలితాల అనంతరం, జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్రపతి ఎన్నిక పక్రియ ఎలా ఉండోబోతోంది?
భారత్‌లో రాష్ట్రపతి రాజ్యాంగాధినేత. త్రవిధ దళాలకు అధిపతి. రాష్ట్రపతి అనుమతి మేరకే చట్టాలు అమల్లోకి వస్తాయి. అయితే, భారత ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతిది నామమాత్ర అధికారమే. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక్షంగా ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిజమైన అధికారం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి రహస్య బాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నుకునే అర్హత ఉన్న సభ్యులను ఎలక్టోరల్ కాలేజ్‌గా వ్యవహరిస్తారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో లోక్‌సభ, రాజ్య సభల సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు సభ్యలుగా ఉంటారు. అయితే, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీల్లో కానీ నామినేటెడ్ సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో సభ్యులుగా ఉండరు. వారికి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదు. అలాగే, రాష్ట్రాల్లోని శాసన మండలి సభ్యులు(ఎమ్మెల్సీ) కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేరు.
ఎంపీలు, ఎమ్మెల్యేల విలువ:
ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్న ఎంపీల సంఖ్య 776. ఎమ్మెల్యేల సంఖ్య 4,033. అంటే, ఎలక్టోరల్ కాలేజ్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య 4,809. అయితే, సభ్యుల సంఖ్య ఆధారంగా ఈ ఎన్నిక జరగదు. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తానికి ఒక విలువ ఉంటుంది. అందులో ఒక్కో ఎంపీకి ఒక విలువ, ఒక్కో ఎమ్మెల్యేకు ఒక విలువ ఉంటుంది. ఈ ఓట్ల విలువను రాజ్యాంగంలోని 55(2) అధికరణంలో పేర్కొన్న ప్రకారం నిర్ధారిస్తారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే.. ఎలక్టోరల్ కాలేజ్ విలువ 10,86,431. ఇందులో ఎంపీల విలువ 5,43,200. అలాగే, ఎమ్మెల్యేల విలువ 5,43,231. ఒక్కో ఎంపీ విలువ 700. మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ విలువలో సగానికి పైగా సాధించిన వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత జరుగుతున్న రెండో రాష్ట్రపతి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యేల విలువ 15708 గా ఉంది. ఇక్కడ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలుండగా, ఒక్కో ఎమ్మెల్యే విలువ 132గా నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇక్కడ ఒక్కో ఎమ్మెల్యే విలువ 159. అంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఎలక్టోరల్ కాలేజ్ విలువ 27,825గా ఉంటుంది.