కేంద్రహోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ పర్యటనలో అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాలీ సంస్కృతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాతాలానికి తొక్కేస్తున్నారని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, స్వామీ వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి గొప్పగొప్ప మేధావులు జన్మించిన గడ్డ బెంగాల్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు.
కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, బెంగాల్ వీరుల ఆశయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.