- అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
- మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘటన
తూప్రాన్ : జీవితాంతం తోడుగా ఉండే భర్త తాను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఉదంతం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, సీఐ స్వామిగౌడ్, ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నగ్రోలికి చెందిన కొండపల్లి శివలింగంకు భార్య సవిత, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
బతుకుదెరువు కోసం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి కుటుంబ సభ్యులతో గత నెల రోజుల క్రితం వచ్చారు. భర్త వాచ్ మెన్ గా, భార్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే సవిత అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం వచ్చింది. దీంతో భార్య సవితను చంపుతానంటూ పలుసార్లు బెదిరించాడు. ఆదివారం అర్ధరాత్రి సవితను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఆయన పోలీసులు వివరించారు.