విశ్వనగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అనేక రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఉందన్నారు. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హెటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఏర్పాటయిన ‘టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో ‘ (Times Home Hunt Expo) కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ నెల 30, 31 తేదీల్లో హైటెక్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ స్టాళ్లను సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 వల్ల అన్ని రంగాలకు దెబ్బ పడింది. అదే రీతిలో రియల్ ఎస్టేట్ రంగంపైన ప్రభావం పడింది. అయినా ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆశాజనకంగా ఉన్నాయి. మళ్లీ అన్ని రంగాలు ముందుకు వెళుతున్నాయి. అదే రీతిలో తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోంది.కాని తెలంగాణ స్వరాష్ట్రమై తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. అంతే కాదు అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ అయింది. తెలంగాణ ఇప్పుడు ఓ బ్రాండ్. చేస్తే తెలంగాణ లో చేసినట్లు చేయాలన్న రీతిలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ బ్రాండ్ ఇమేజ్ మన రాష్ట్రానికి సృష్టించారు.
ఇవాళ దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా హైదరాబాద్ నగరం పేరు పొందింది. చక్కటి వాతావరణం, 24 గంటల కరెంటు,తాగు నీటి కొరత లేని ప్రాంతం. మెట్రో , ఆర్టీసీ వంటి రవాణా సదుపాయాలు మంచి విద్యాలయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న నగరం ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ విశిష్టత అంతా ఇంతా కాదు. అందుకే ఇది భాగ్యనగరం అయింది.అందుకే హైదరాబాద్ ఎవరు వచ్చినా ఈ నగరంతో ప్రేమలో పడతారు. మర్చిపోలేరు మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలన్నంత ప్రేమను ఈ నగరం అందిస్తుంది.అనేక మంది ప్రముఖులు ఇక్కడ స్థిరపడాలని ఇళ్లు కొనుక్కొంటున్నారు.
అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అనుమతులు వేగంగా వచ్చేలా రూపాయి ఖర్చు లేకుండా నిర్మాణ పనులకు అనుమతులు వచ్చేలా చట్టాలు చేసింది. అవి అమలవుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు లేవు. ఇక ఇలాంటి కార్యక్రమాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పత్రికా సంస్థ చేపట్టండ అభినందనీయం.