end

హైదరాబాద్‌ సంచలన విజయం..

రాణించిన సాహా, వార్నర్

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు.. ఢిల్లీ క్యా్పిటల్స్‌ జట్టుపై 88 రన్స్‌తో అద్భుత విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన డీసీ 19 ఓవర్లలోనే 131 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్ రహానే (26 పరుగులు), పంత్‌(36 పరుగులు) మాత్రమే కాసేపు పోరాడారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ను తొలి ఓవర్లోనే సందీప్‌ శర్మ ఔట్‌ చేశాడు. ధావన్‌తో ప్రారంభమైన డీసీ వైఫల్యం.. చివరి దాకా కొనసాగింది. ఎస్‌ ఆర్‌ హెచ్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లతో రాణించగా.. సందీప్‌ శర్మ, నటరాజన్‌ 2 వికెట్లు, నదీమ్‌, హోల్డర్‌, విజయ్‌ శంకర్‌ తలా ఓ వికెట్ తీశారు. హైదరాబాద్‌ బౌలర్లు.. డీసీ బ్యాట్స్‌మెన్‌ను ఏ దశలోనూ విజయం దిశగా సాగనివ్వలేదు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి, 219 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌(34 బంతుల్లో 66 పరుగులు; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా(45 బంతుల్లో 87 పరుగులు; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ డిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. బౌండరీలు, సిక్సర్లతో డీసీని అల్లాడించారు. వార్నర్‌ను.. అశ్విన్‌ ఔట్ చేశాక.. క్రీజులోకి వచ్చిన మానిష్‌ పాండే (44 పరుగులు) సాహాకు చక్కటి సహకారాన్ని అందించాడు. సెంచరీ దిశగా సాగుతున్న సాహాను నోర్ట్జే ఔట్‌ చేశాడు. అనంతరం, పాండేతో కలిసిన విలియమ్సన్‌ 11 పరుగులతో హైదరాబాద్‌ విజయాన్ని ఖాయం చేశాడు. డీసీ బౌలర్లలో అశ్విన్‌, నోర్ట్జే తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు 5 విజయాలతో 6వ స్థానంలో నిలిచింది. ఈ విజయంతోనైనా ప్లే ఆఫ్‌ బెర్త్‌ ఖాయం చేసుకుందామనుకున్న డీసీకి ఈ పరాజయంతో మరో విజయం వరకు నిరీక్షణ తప్పేట్లు లేదు. ఈ పరాభవం డీసీకి వరుసగా మూడోది కావడం వారి దురదృష్టం అనవచ్చు.

పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న డీసీ ఈ పరాజయంతో మూడో స్ధానానికి పడిపోయింది. అద్భుత అర్దసెంచరీతో అదరగొట్టిన సాహా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Exit mobile version