హైదరాబాద్(Hyderabad) లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు(Local body MLC elections) అంశం హాట్ టాపిగ్గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. బీజేపీ, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ నెల 23న ఎన్నిక జరిగింది. శుక్రవారం ఉదయం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్(Mirza Riyaz Ul Haasan) 63 ఓట్లు సాధించి అఖండ విజయం సాధించారు. ఈ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగడం విశేషం.
ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా, ఎంఐఎంకు 49 ఓట్లు ఉన్నాయి. అయితే.. ఎంఐఎంకు ఇతర పార్టీలకు చెందిన ఓటర్లు మద్దతు ఇవ్వడంతో ఆయనకు 63 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో తొమ్మిది మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు తొమ్మది చొప్పున ఉండగా.. కాంగ్రెస్‌కు ఏడు, భాజపాకు ఆరు ఉన్నాయి.
మరోవైపు ఎంఐఎం గెలుపుతో ఆ పార్టీ నేతలు సంబురాలు జరుపుకొంటున్నారు.