end

పార్టీ ఓటమికి నాదే బాధ్యత

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక తుది ఫలితాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు. ఓటమికి గల కారణాలు సమీక్షించుకొని, లోపాలను సరిదిద్దుకుంటామని హరీశ్‌రావు చెప్పారు. పార్టీ గెలవకపోయినా.. దుబ్బాక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన దుబ్బాక ప్రజలకూ, ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను మంత్రి హరీష్‌ రావు ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ, నిర్విరామంగా ప్రచారం చేశారు. అన్నీ తానై ముందుకు నడిపించారు. బై ఎలక్షన్‌లో ఇప్పటివరకు హరీష్‌ రావు బాధ్యత తీసుకున్న ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ ఓడిపోలేదు. ఈ ఎన్నికల్లోనూ భారీ ఆధిక్యంతో పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు.

Exit mobile version