న్యూఢిల్లీ: ‘’టీమ్ఇండియా తరఫున టెస్టుల్లోనూ ఆడాలనుందని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అన్నాడు. 2016లో టీమ్ఇండియాలో అరంగేట్రం చేసిన చాహల్ ఇప్పటి వరకు 52వన్డేలు, 42 టీ20లు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్ అవకాశం రాలేదు. పరిమిత ఓవర్లలో మాత్రం భారత జట్టులో కీలక బౌలర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టెస్టులు ఆడేందుకు కావాల్సిన ఓపిక తనకు పూర్తిగా ఉందని, సంప్రదాయ ఫార్మాట్లోనూ రాణించగలనని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చాహల్ అన్నాడు.
“నా చివరి 8 రంజీమ్యాచ్ల్లో 46వికెట్లు తీసుకున్నా. మ్యాచ్ల్లో నేను 20 నుంచి 25 ఓవర్ల స్పెల్స్ కూడా వేశా. ఎర్ర బంతా, తెల్లబంతా అని నేను ఎక్కువగా ఆలోచించను. నేను ఆటను ఆస్వాదించాలనుకుంటా. ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకునేందుకు నేను ఇష్టపడతా. ప్రతి అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నా. టీమ్ఇండియా తరఫున వన్డేలు, టీ20లు ఆడా. కానీ టెస్టు ప్లేయర్ అని పిలిపించుకుంటే ఆ ఫీలింగే వేరు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పరుగులు కట్టడి చేసినా చాలు. అయితే టెస్టుల్లో వికెట్ తప్పకతీయాలి. అదే పెద్ద సవాల్. టెస్టు క్రికెట్ ఆడేందుకు చాలా ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. టెస్టులు ఆడేందుకు కావాల్సిన ఆ లక్షణాలు నాలో పుష్కలంగా ఉన్నాయని నేను నమ్ముతా” అని చాహల్ చెప్పాడు.