అనధికారంగా ఉంటున్న వారిపై అగ్రరాజ్యం హెచ్చరికలు
‘అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు(Illegal residents) తప్పనిసరిగా తమ వివరాలను ప్రభుత్వ రికార్డు(Government records)ల్లో నమోదు చేయించుకోండి. లేదంటే అపరాధ రుసుము చెల్లించక తప్పదు. నిబంధనలు పాటించని వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. లేదంటే వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోండి. మీకు ఎలాంటి నేర చరిత్ర(Crime background) లేకుంటే మీరు సంపాదించిన సొమ్మును సైతం వెంట తీసుకెళ్లండి. మీరు అమెరికాను వీడేందుకు విమాన ఖర్చులకు డబ్బుల్లేక పోతే మా ప్రభుత్వం రాయితీలు సైతం అందిస్తున్నది’ అని తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. చివరి నోటీసులు(Final notices) అందుకున్న వారు నిర్దేశిత గడువుకు మించి ఒక్కరోజు అమెరికాలో ఉన్న రోజుకు 998 డాలర్ల చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘన బట్టి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు.. అలాంటి వారికి భవిష్యత్తులో తమ దేశంలోకి ప్రవేశం ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ హెచ్చరికలు హెచ్1బీ1, విద్యార్థి అనుమతులపై అమెరికాలో ఉండేవారికి వర్తించదని, కేవలం సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉంటున్న వారికి మాత్రమేనని స్పష్టం చేసింది.