end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంఅపార క్షమాగుణ సంపన్నుడు
- Advertisment -

అపార క్షమాగుణ సంపన్నుడు

- Advertisment -
- Advertisment -
  • ఇస్లాం వెలుగు

పూర్వం సుఫ్యాన్‌ సూరి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు ఉండేవారు. అతని పొరుగున ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని పెద్ద తాగుబోతు. ఎప్పుడూ నిషాలోనే ఉండేవాడు. ఇస్లామ్‌లో మద్యపాన సేవనం నిషిధ్ధం. కాని ఆవ్యక్తి అదేమీ పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్ళకు ఆవ్యక్తి చని పోయాడు. అందుకని అతని జనాజా నమాజు చేయించడానికి ఎవరూ ముందుకు రాలేదు. సుఫ్యాన్‌ సూరీ కూడా వెళ్ళలేదు. ఒక విశ్వాసికి ఇలాంటి దుర్గతి పట్టిందే అని బాధ పడ్డారు. అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నారు. అప్పుడాయనకు ఒక కల వచ్చింది. పొరుగు వ్యక్తి జనాజా నమాజు చేయించాలన్నది కల సారాంశం. మెలకువ వచ్చిన వెంటనే సుఫ్యాన్‌ సూరీ ఆలోచనలో పడ్డారు. చివరికి ఈ కలలో ఏదో పరమార్ధం ఉండి ఉంటుందని భావిస్తూ, పొరుగింటికి వెళ్ళారు. కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ మనిషి ఎప్పుడూ తాగుతూ..తిరుగుతూ.. ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు కదా.. అసలు ఇతని ఆచరణ ఏమిటి.. మరణ సమయాన ఇతని పరిస్థితి ఏమిటి..? అని ఆరాతీశారు.

అప్పుడు కుటుంబ సభ్యులు, ‘అవునండీ.. ఇతనెప్పుడూ తాగుతూనే ఉండేవాడు. ఎంత వారించినా వినేవాడుకాదు. పైగా, ఎదురు తిరిగి మమ్మల్నే తిట్టిపోసేవాడు. కాని చివరి రోజుల్లో తప్పు తెలుసుకున్నాడు. తాగుడు మానేసి పశ్చాత్తాప పడేవాడు. చేసిన పాపాల పట్ల సిగ్గు పడుతూ లోలోన కుమిలిపోయేవాడు. అంతిమ సమయం లో బాగా ఏడ్చాడు. తన ప్రభువు ముందు సాగిలపడి క్షమించమని మొర పెట్టుకున్నాడు. పరివర్తిత హృదయంతో కడుదీనంగా  దైవాన్ని వేడుకున్నాడు. అదే స్థితిలో అతను అంతిమశ్వాస విడిచాడు’. అని చెప్పారు కుటుంబ సభ్యులు. ఈ సంఘటనను ఉటంకిస్తూ సుఫ్యాన్‌ సూరీ ఇలా అన్నారు. దైవ కారుణ్యం అనంతం. దానికి పరిమితులు లేవు. మానవుడు ఎప్పుడు, ఏ సమయంలో తన వైపుకు మరలినా అక్కున చేర్చుకోడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన కారుణ్యం సంకుచితమైనదికాదు. బహు విశాలమైనది. దానికి ఎల్లలు, పరిధులు లేవు. ఇన్నాళ్ళుగా  తప్పులు చేశామే.. పాప కార్యాలకు ఒడిగట్టామే.. జీవితమంతా తప్పుడు మార్గంలో గడిపి, ఇప్పుడు చివరిరోజుల్లో మంచి మార్గంలో నడిచినా ప్రయోజనమేమిటి? అని చాలామంది అనుకుంటారు.

కాని ఈ భావన పూర్తిగా తప్పు. కేవలం ఈ కారణంగానే సన్మార్గానికి దూరంగా ఉండిపోయేవారు ఎంతోమంది. కాని ఇది సరైన విధానం కాదు. తెలిసో, తెలియకో జరిగిన తప్పులు, పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది, ఇకనుండి అలాంటి దుర్నడతకు దూరంగా ఉంటామని ప్రతిన బూనాలి. దేవుని ముందు తప్పుల్ని అంగీకరించి, ఇకనుండి పరిశుధ్ధ జీవితం గడుపుతాము క్షమించమని వేడుకోవాలి. చిత్తశుధ్ధితో క్షమాపణ వేడుకునే వారి గత పాపాలన్నిటినీ దైవం క్షమిస్తాడు. పర్వతమంత ఎత్తు పేరుకు పోయిన పాపాలైనా, సముద్ర నురగకు సమానమైన పాపాలైనా సరే.. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కారుణ్య ద్వారాలు అనునిత్యం తెరుచుకునే ఉంటాయి. తన దాసుల్ని శిక్షించాలన్నది ఆయన ఉద్దేశ్యం కానే కాదు. నిజానికి ఆయన కరుణ తన దాసులను క్షమించడానికి సాకులు వెదుకుతుంది. ఎందుకంటే ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -