- ‘వందే భారత్’ రైల్వే టెండర్ల రద్దు
కేంద్రం మరోసారి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ‘వందే భారత్’లో భాగంగా సెమీ హైస్పీడ్ రైల్వే తయారీకి జారీ చేసిన టెండర్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగానే వారం రోజుల్లోగా మళ్లీ టెండర్లు పిలిచి ఖరారు చేస్తామని తెలిపింది. చైనాకు ఈ టెండర్ వెళ్లేలా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చైనాకు మరో దెబ్బ తగిలినట్లయింది. చైనా జాయింట్ వెంచర్, సీఆర్‌ఆర్‌సీ పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైళ్లను సరఫరా చేసే ఆరుగురు పోటీదారుల్లో ఏకైక విదేశీ బిడ్డర్‌గా ఉంది. ‘సెమీ హైస్పీడ్ రైలు 44 సెట్ల (వందేభారత్) తయారీ టెండర్ రద్దయింది.
(వ్యాక్సిన్ వచ్చే వరకు బడులు లేనట్టే!)
టెండర్ ఆర్డర్లు సవరిస్తామని, తదనంతరం వారం పదిరోజుల్లోగా తిరిగి కొత్త టెండర్లు పిలుస్తామని తెలిపారు. చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ యోంగ్జీ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్, గురుగ్రామ్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2015లో జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. ఒక దేశీయ సంస్థ టెండర్‌ను తీసుకునేలా రైల్వే టెండర్ ఇచ్చింది. అయితే చైనా జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ముందు వరసలో ఉందని భావించిన అనంతరం టెండర్లను రద్దు చేసింది. చెన్నైలోని ఇండియన్ రైల్వేస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జూలై 10న టెండర్‌ను ఖరారు చేసింది.
(డిసెంబర్‌లో కరోనా వైరస్ అంతం!)
మిగిలిన ఐదు బిడ్డర్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఇండస్ట్రీస్, సంగ్రూర్, ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేధా సర్వో డ్రైవ్స్ ప్రయివేట్ లిమిటెడ్, పవర్ నెటిక్స్ ఎక్విప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.