మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచుల్లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచాయి. అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, తాజాగా మెల్‌బోర్న్‌లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేయగా, ప్రతిగా భారత్ 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 200 పరుగులకే కుప్పకూలింది. దీంతో విజయానికి అవసరమైన 70 పరుగులను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లంతా సమిష్టిగా రాణించడం ఇక్కడ ప్రత్యేకత. సీమర్లు, స్పిన్నర్లు పోటాపోటీగా వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ రహానే సెంచరీతో జట్టును ముందుకు నడిపించడంతో అద్భుతమైన కెప్టెన్సీతో మ్యాచును గెలిపించింనందుకు గానూ ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పదేళ్ల తర్వాత ప్రత్యేకమైన విక్టరీ..
అయితే, ఈ విజయం భారత్‌కు చాలా ప్రత్యేకమైనది. భారత్ వెలుపల ఓ టెస్టు మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ చేసి విజయం సాధించడం 2010 తర్వాత మన జట్టుకు ఇదే తొలిసారి. ఆగస్టు 2010లో కొలంబోలో జరిగిన టెస్టులో తొలుత ఫీల్డింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత మళ్లీ దేశం వెలుపల తొలుత ఫీల్డింగ్ చేసి విజయం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు, 2011/12 తర్వాత టాస్ గెలిచి ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి. అప్పట్లో హోబర్ట్‌లో న్యూజిలాండ్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.