సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఇండియా ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 174 పరుగులకే పరిమితమైంది. దీంతో 12 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న కె ఎల్ రాహుల్‌ను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి.. ధావన్‌కు జత కలిశాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించాక ధావన్(21 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఔట్ అయ్యాడు. మరి కాసేపట్లోనే సంజూ సాంసన్(10)ను స్వెప్సన్ ఔట్ చేశాడు. కెప్టెన్ కోహ్లి ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మరో 9 బంతులు మిగిలుండగా విరాట్ కోహ్లి(61 బంతుల్లో 85; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువవడంతో బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. జోరు మీదున్న పాండ్యా(20)ను జంపా ఔట్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ 3 వికెట్లతో రాణించగా.. మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్, ఆండ్రూ టై, జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్ డకౌట్ అయినా.. ఓపెనర్ మాథ్యూ వేడ్(53 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవెన్ స్మిత్ (24), మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వేడ్, మ్యాక్స్‌వెల్ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సుందర్ 2 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, శార్దూల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు. మూడు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్వెప్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.