సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలుచుకుంది. రెండో వన్డేలోనూ భారీ పరుగులు చేసిన ఆసీస్ 51 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ) తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు. భారత బౌలర్లపై ఆధిపత్యం చలాయించిన స్మిత్.. ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో కీలక భూమిక పోషించాడు. తర్వాత లబూషేన్(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్ రికార్డు స్కోరు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ పోరాటాన్ని కడవరకూ సాగించిన భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (30; 23 బంతుల్లో 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(28; 26 బంతుల్లో 4 ఫోర్లు)లు 9 ఓవర్లలోపే ఔటయ్యారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి(89 ; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(38; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు ఇన్నింగ్స్‌కు మరమ్మత్తులు చేశారు. ఈ జోడి మూడో వికెట్‌కు 93 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్ పెవిలియన్ చేరాడు. హెన్రిక్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం కోహ్లి-కేఎల్ రాహుల్‌లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ప్రధానంగా రాహుల్ ఫోర్లు, సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ జంట 72 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. హజిల్‌వుడ్ బౌలింగ్‌లో హెన్రిక్స్ ఒక మెరుపు క్యాచ్ అందుకోవడంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. ఆపై హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 63 పరుగులు జోడించిన తర్వాత రాహుల్(76; 66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత టీమిండియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జడేజా(24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా(28; 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు మోస్తరుగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కిమ్నిన్స్ 3 వికెట్లతో చెలరేగగా.. హెజెల్‌వుడ్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు, హెన్రిక్స్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.