న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తప్పుకుంది. గల్వాన్ ఘటన తర్వాత చైనాతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెరుగుతుండడం భారత్‌లో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాగే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివోను కొనసాగిస్తామని బీసీసీఐ ఇటీవల ప్రకటించడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఐపీఎల్‌ను బహిష్కరించాలని కూడా కొందరు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివోనే ఈ ఏడాది స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉండేందుకు బీసీసీఐతో వివో ఐదేండ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం 2018 నుంచి ప్రతి ఏడాది రూ.440కోట్లను బీసీసీఐకు వివో చెల్లిస్తున్నది. ఈ ఏడాది స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్నా.. 2021, 2022, 2023 సీజన్ల కాంట్రాక్టు ఇంకా మిగిలే ఉంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ కోసం కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ మరో మూడు రోజుల్లో టెండర్లు ఆహ్వానించనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 13 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు జరుగనుంది.