హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. నిన్న టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ భవన్‌లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్పి ప్రజలను మోసగిస్తారని నిలదీశారు. క్రితంసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..? అంటూ కిషన్ రెడ్డి టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిటీలో రోడ్‌షో నిర్వహించిన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి టీఆర్‌ఎస్ బూటకపు మాటలు నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. వారు సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి, నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. బీజేపీని గెలిపిస్తే.. హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నెం.1 నగరంగా నిలుపుతామన్నారు. రోడ్లు, స్వచ్ఛత, ట్రాఫిక్.. ఇలా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి నగర ప్రజల ఆదరణ చూరగొంటామని ఆయన అన్నారు.