అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎన్నికవడం, ఆ పార్టీ తరఫున పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడం తమ కళ అని, అందుకు ప్రజల మద్దతు లభించడం చాలా సంతోషమన్నారు రోజా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. గురువారం నాడు అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె.. మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా జగన్ చేపట్టిన పథకాలు, మహిళలకు సీఎం ఇచ్చిన ప్రాధాన్యతను కూడా అసెంబ్లీ వేదికగా రోజా వివరించారు.
వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం తన పూర్వ జన్మ సుకృతం. మహిళల పక్షపాతి సీఎం వైఎస్ జగన్. భావితరాల గురించి ఆలోచించే నేత సీఎం జగన్ మాత్రమే. టెలివిజన్‌లో ఎలా కనిపించాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్. ప్రజలకు ఉజ్వల భవిష్యత్ కల్పించాలన్నది సీఎం జగన్ విజన్. మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే సాధికారత కోసం సీఎం కృషి చేస్తున్నారు. చంద్రబాబుది 420 విజన్. వైఎస్ జగన్ విజన్.. ఓ విప్లవం. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు వైఎస్ జగన్’ అని ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.